నెక్స్ట్‌ టార్గెట్‌ సంతోష్‌..భూకుంభకోణాలపై సి ఐ డి ఫోకస్

(హైదరాబాద్‌, ది జర్నలిస్ట్‌ ప్రతినిధి)
ఇప్పటికే కూతురు కవిత నిర్వాకంతో తలబొప్పికట్టిన మాజీముఖ్యమంత్రి కెసిఆర్‌ను మరిన్ని తిప్పలు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్దమైంది. కేంద్రం కవితను టార్గెట్‌గా చేసుకుంటే రాష్ట్రం సంతోష్‌పై లక్ష్యాన్ని గురిపెట్టింది. ఉద్యమ సమయంలో పార్టీలోకొచ్చిన సంతోష్‌ గత పదేళ్ళ బిఆర్‌ఎస్‌ పాలనలో వెనకుండి చక్రం తిప్పారు. అప్పనంగా వెయ్యి ఎకరాల భూముల్ని సామాజిక సేవా సంస్థ పేరిట బదలాయించుకున్నారు. నిషిద్ద జాబితాలో ఉన్న 22ఎక రాల భూమిని తనపేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. గత పదేళ్ళలో ఆయన పలు వ్యవస్థల్ని గుప్పెటపట్టారు. ముఖ్యంగా విూడియాను తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారు. ఎంపిక చేసిన కొన్ని విూడియా సంస్థలకు ప్రభుత్వపరంగా ప్రకటనలిస్తూ అందుకోసం జారీ అయ్యే బిల్లుల్లో సింహభాగాన్ని తన ఖాతాలకు బదలాయించుకున్నారు. రాష్ట్రంలో జర్నలిజాన్ని భ్రషప్టపట్టించారు. ఓ దినపత్రికకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్న ఆయన తన అదుపాజ్ఞలకు లోబడ్డ మరికొన్ని దినపత్రికల్లో వార్తలు, వార్తాంశాలు, కథనాల్ని ఏకపక్షంగా తమ పార్టీ, కెసిఆర్‌ కుటుంబ సభ్యులకనుగుణంగా రాయించారు. ఇందుకోసం కొందరు జర్నలిస్టుల్ని నియమించుకున్నారు. వారు రాసే కథనాల్ని యదావిధిగా ప్రచురించాలని కొన్ని పత్రికలకు ఆదేశాలు జారీ చేసేవారు. ఇలా.. ప్రభుత్వం ద్వారా విడుదల చేయించిన ప్రకటనల్లో తన భాగంగా సుమారు 300కోట్లు ఆయనవెనకేసుంటారని ప్రాధమికంగా దర్యాప్తు బృందాలు గుర్తించినట్లు సమాచారం.


అర్ధరూపాయి పెట్టుబడి లేకుండా వెయ్యి ఎకరాల భూముల్ని పొందడంతో పాటు జాతీయ స్థాయిలో ఆయన సెలబ్రిటీగా మారిపోయారు. ఇందుకోసం ఆయన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కొండగట్టు అటవీ ప్రాంతంలో వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని తనకు దత్తతివ్వాలని కెసిఆర్‌ను కోరారు. కాగా తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కెసిఆర్‌ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్నానుకునున్న వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని ఈ సంస్థకు దత్తతిచ్చేందుకు అంగీకరించారు. శ్రీరాముడికి నమ్మిన బంటైన ఆంజనేయుడు స్వయంభూగా వెలిసిన ప్రాంతం జగిత్యాల జిల్లా కొండగట్టు. సహజమైన కొండలు, గుట్టల మధ్య గల ఈ ఆలయాన్ని కెసిఆర్‌ పునర్‌నిర్మించారు. ఈ నేపధ్యంలోనే ఈ వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని అభివృద్ది పేరిట గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు దత్తతకిచ్చేశారు. అక్కడ్నుంచి సంతోష్‌ సొంత ప్రాభవం మొదలైంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని ప్రముఖులకు మొక్కలు నాటాలంటూ ఆయన ఛాలెంజ్‌లు విసిరారు. అమితాబ్‌, సల్మాన్‌, రాజమౌళి, ప్రభాస్‌, చిరంజీవి, నాగార్జున, మోహన్‌బాబు వంటి ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో భాగంగా స్వయంగా వచ్చి ఇక్కడ మొక్కలు నాటారు. దీంతో సంతోష్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేసింది. అంచెలం చెలుగా ఇతర ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన్ను ముఖ్యఅతిధిగా ఆహ్వానించడం మొదలైంది. తెలంగాణాను ఆకపచ్చదళంతో కప్పేద్దామన్న స్లోగన్‌ను అందిపుచ్చుకున్న సంతోష్‌ తన సంస్థ పేరిట బదలాయించుకున్న వెయ్యి ఎకరాల భూమికి అప్రకటిత యజమానయ్యారు.
ఇక ధరణిలోని లోపాల్ని ఆసరాగా చేసుక ధిత భూమిని ఆయన తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

సంతోష్‌ స్వగ్రామంలో పేదల భూముల ను నిషేదిత జాబితాలో ఉన్నట్లు తొలుత ధరణి పోర్టల్‌లో చూపించారు. ఇందులో కొంత భాగం సంతోష్‌ కుటుంబసభ్యుల పేరిట కూడా ఉంది. అది రెండు నుంచి మూడు ఎకరాలు మాత్రమే. కానీ ఓ రోజు రాత్రికి రాత్రే నిషేదిత భూముల జాబితాలోని 22ఎకరాల భూములు సంతోష్‌కు చెందిన ఓ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఆయన హయాంలో జరిగిన భూ దందాపై ఇప్పుడు రేవంత్‌ ప్రభుత్వం దృష్టిసారించింది. గ్రీన్‌ ఛాలెంజ్‌ సంస్థకు దత్తతిచ్చిన వెయ్యి ఎకరాల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సమాయత్తమౌతోంది. అలాగే ఆయన సంస్థ పేరిట పట్టా పొందిన 22ఎకరాల భూములపై విచారణకు సిద్దపడుతోంది. ఆయన హయాంలో పత్రికలకు జారీ చేసిన ప్రకటనలకు సంబంధించి వాస్తవ విలువ నిర్ధారణకు ఓ కమిటీ వేయాలని నిర్ణయించింది.