బీజేపీ ఏపీ నుంచి పోటీ చేసే స్థానాలు, అభ్యర్దుల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. గురువారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. అందులో ఆమోదం పొందిన తరువాత జాబితా అధికారికంగా ప్రకటన చేయనున్నారు. బీజేపీ పాడేరు, వైజాగ్ నార్త్, శ్రీకాకుళం, అనపర్తి, కైకలూరు, విజయవాడ పశ్చిమం, బద్వేలు, ఆదోని, జమ్మలమడుగు, ధర్మవరం, 11వ స్థానంగా కాకినాడ అసెంబ్లీ స్థానాలు ఖరారైనట్లు సమాచారం. అదే విధంగా ఎంపీ స్థానాలుగా విజయనగరం, అరకు, అనకాపల్లి, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి నియోజకవర్గాలు ఫైనల్ అయ్యాయి. అయితే, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరిన విధంగా టీడీపీ ముద్ర ఉన్న నేతల విషయంలో ఇద్దరికి సీట్లు ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం నిరాకరించినట్లు సమాచారం.
స్థానాలు – అభ్యర్దులు ఖరారు :
పార్టీ కోసం ఏళ్ల తరబడిగా పని చేస్తున్న వారికి కూడా సీట్లు కేటాయించాలని గత వారం బీజేపి హై కమాండ్ కి ఏపీ నేతలు లేఖ రాసారు. దీంతో, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ తో పాటుగా జీవీఎల్ పేరు రేసులో ఉంది. అనకాపల్లి నుంచి మాధవ్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, అరకు నుంచి కొత్తపల్లి గీత, నర్సాపురం నుంచి నరేంద్ర వర్మ, తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ రత్నప్రభ కుమార్తె పేర్లు తుది జాబితాలో ఉండే అకవాశం ఉందని తెలుస్తోంది. సోము వీర్రాజును కాకినాడ లేదా అనపర్తి నుంచి పోటీకి దింపే ఛాన్స్ ఉంది. జమ్మల మడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. గురువారం రాత్రి ఈ జాబితాను బీజేపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.